TRT ఎగ్జామ్ లో తెలుగులో హయ్యస్ట్ స్కోర్ ఎలా ?

(SGT/SA అభ్యర్థులకు చింతల రాకేశ్ భవానీ సార్ అందిస్తున్న విలువైన సూచనలు)

ఎస్.జీ.టి పరీక్ష తెలుగు కంటెంట్ కు సంబందించి 18 ప్రశ్నలకు అర మార్కు చొప్పున 9 మార్కులుంటాయి. ప్రశ్నల స్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ లో ఇవ్వడం జరిగింది. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఒక్కో విభాగం నుంచి ఆరు (6) ప్రశ్నల చొప్పున మొత్తం 30 ప్రశ్నలకు 15 మార్కులు కేటాయించారు. ఇందులో తెలుగు విషయానికొస్తే 6 ప్రశ్నల అర మార్కు చొప్పున మొత్తం 3 మార్కులుంటాయి. మొత్తంగా SGT పరీక్ష తెలుగు కంటెంట్, మెథడాలజీలో 12 మార్కులుంటాయి.

ఇక స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో తెలుగు కంటెంట్ కు 88 ప్రశ్నలకు అర మార్కు చొప్పున 44 మార్కులు కేటాయించారు. కంటెంట్ ప్రశ్నల స్థాయి ఇంటర్మీడియెట్ వరకు ఉంటుంది. టీచింగ్ మెథడాలజీకి సంబందించి 32 ప్రశ్నలకు అర మార్కు చొప్పున 16 మార్కులు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్ కి సంబందించి తెలుగు కంటెంట్, మెథడాలజీకి మొత్తం 60 మార్కులుంటాయి.

తెలుగు కంటెంట్ కు సంబంధించి SGT, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కామన్ గా ఉన్నా చాప్టర్లను సమన్వపర్చుకుంటూ కిందివిధంగా సన్నద్ధమవ్వాలి

మొదటి అధ్యాయంలో కవులు, రచనలు, కావ్యాలు రచయితలకు సంబందించినది. ఇందులో SGT అభ్యర్దులు 2015 లో రూపొందించిన 2 నుంచి 10వ తరగతి తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ కవులు వారి రచనలు, కావ్యాలు-రచయితలు, ఇతర తెలుగు కవులు, రచయితల గురించి క్షుణ్ణంగా చదవాలి. దీనికి అదనంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులు ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను చదవాలి.

SGT, SA అభ్యర్థులిద్దరూ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాలు

1) కవుల కాలం, జన్మస్థలం, బిరుదులు, ఆస్థాన పదవులు, సమకాలికులు
2) కలం పేర్లు, అంకితాలు, ప్రశంసలు
3) కవితా రీతులు, కావ్యాల్లోని పాత్రలు, నేపథ్యం, పూర్వపదాలు
4) కావ్యాల్లోని కొటేషన్లు

ఈ అధ్యాయానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధుల పై పాఠ్యపుస్తకాలతో పాటుగా వేమూరి శ్రీనివాసరావు రాసిన ‘‘పూర్వ గాధాలహరి’’ చదివితే అదనపు ప్రయోజనం ఉంటుంది.

రెండో అధ్యాయంలో: పురాణాలు, ఇతిహాసం, ప్రబంధం, శతకం, కథ, కథానిక, స్యీయచరిత్ర/ఆత్మకథ, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, లేఖ, వ్యాసం, సంపాదకీయం, దినచర్య, గత్విక, నవల, నాటిక, పీఠిక, విమర్శ మొదలైన ప్రాచీన, అధునిక ప్రక్రియలున్నాయి. SGT అభ్యర్దులు కొన్ని ప్రక్రియలను సిలబస్ లో పేర్కొనకపోయినప్పటికీ చదివితే మంచిది. ఈ ప్రక్రియలను చదివేటప్పుడు ముఖ్యంగా వీటికి సంబందించిన లక్షణాలు, వివరణలు, పరిశోధనలు చేసిన వ్యక్తులు, తొలి రచనలు, ప్రత్యేకతలు, మారు పేర్లు మొదలగునవి. క్రమ పద్దతిలో చదవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులు ఈ అధ్యయానికి సంబందించి ఆచార్య జి.నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష రెండు సంపుటాలు, డా. ద్వానశాస్ర్తి తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాలను తప్పక చదవాలి.

3వ అధ్యాయంలో ‘భాషారూపాలలో’ భాగంగా శాసన భాష, గ్రాంధిక భాషా, వ్యవహరిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రమాణభాష, ప్రసార మాద్యమాల భాషలను చదవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మాండలికాల చరిత్రను అధ్యయనం చేస్తూ వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడులో 4 భాషా మండలాలుగా విభజించిన ఆచార్య భద్రిరాజు క్రిష్ణమూర్తి పూర్వ, దక్షణ, ఉత్తర, మధ్య మండలాల్లోని పదాలు పరీక్షల కోణంలో ముఖ్యంగా చదవాలి. గ్రాంధిక భాషావాదులు, వ్యవహారిక భాషావాదులు, రచనలు, స్థాపించిన పత్రికలు, సంస్థలు మొదలగునవి చదవాలి.

4 వ అధ్యాయంలో SGT వారు భాషాంశాల్లో భాగంగా భాషా భాగాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి వికృతులు, సామెతలు, పొడుపు కథలు, నుడికారాలు, జాతీయాలు సంధులు, సమాసాలు, అలంకారాలు, చందస్సు, వాక్యం భేధాలు, కర్తరి, కర్మణి, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు చదవాలి. వీటికి సంభందించి 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదవాలి. పాఠ్యపుస్తకాల చివర్లో ఉన్న అంశాలను చదివితే సరిపోతుంది. అయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులు వీటితో పాటుగా అదనంగా గ్రామ్యాలు, దేశం, అన్యాదేశ్యం, పదం, ప్రతిపాదిక, ప్రత్యయం, అర్ధ పరిణామం, ధ్వని పరిణామం, వ్యాకరణ పారిభాషికా పదాలు, ధ్యని ఉచ్ఛారణ, ధ్యని ఉత్పత్తి స్థానాలు చదవాలి. అర్ద పరిణామం, ధ్వని పరిణామాల్లోని రకాలు, ఉదాహరణలు, భాషోత్పత్తి వాదాలలో బాబా వాదం, డింగ్ డాంగ్ వాదం, ధాతువాదం, స్వత: సిద్ధవాదం, యెహహో వాదాలు, ప్రతిపదకులు పరీక్షల కోణంలో అతి ముఖ్యమైనవి. వాక్య భేధాలు సామాన్య, సంయుక్త వాక్యాలు గూర్చి చదువుతూ... నేల క్రిష్ట వాక్యాల్లోని చేదర్షక, క్త్వార్ధక, శత్రర్షకలల గూర్చి ప్రత్యేకంగా చదవాలి. దీనికి గాను ఆచార్య చేకూరి రామారావు గారు రాసిన తెలుగు వాక్యంను చదవాలి.

కామన్ గా ఉన్న ఈ అధ్యయాలు కాకుండా కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులు ఆధునిక సాహిత్యం ఉద్యమాలు-ధోరణులు అధ్యాయంలో ప్రధానంగా భావ కవిత్వం మొదలుకొని స్త్రీవాదం, అభ్యుదయ వాదం దిగంబర, విప్లవ, దళితవాద, మైనార్టీవాద, అనుభూతివాద కవితలను వరస క్రమంలో చదవాల్సి ఉంటుంది. ఉద్యమ కవితలలోని కవులు వారి రచనలు కోటేషన్లనపై తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ నుంచి ‘తెలుగు కవితోద్యమాలు’ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.

‘జానపదసాహిత్యం’ అభ్యుదయానికి సంభందించి ప్రధానంగా జానపద సాహిత్యం విభాగాల గూర్చి పూర్తిగా చదవాలి. జానపద సాహిత్యంలో కృషి చేసిన తెలుగు, ఆంగ్లేయ పరిశోధకుల వివరాల జాబితాను రూపొందించుకొని చదవాలి. దీనికి సంబందించి ఉపయుక్త గ్రంధాలు.

ప్రధానంగా:

1 జానపద గేయ వాజ్ఞయమం - ఆచార్య బిరుదు రాజు రామరాజు
2 ఆంధ్రుల జానపదవిజ్ఞానం - ఆచార్య ఆర్.వి.యస్ సుందరం
3 జానపద విజ్ఞానాధ్యయనం - ఆచార్య జీ.యస్ మోహన్

తెలుగు భాషా సాహిత్యంలో ఇతర భాషా సాహిత్యం ప్రభావం అలాగే అధ్యాయాల భాగంగా తెలుగు భాషలు చేరిన పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, పర్షియన్, అరబిక్, ఒరియా, తమిళం, కన్నడం, మరాఠీ, ఉర్ధూ, సంస్కృతం పదాలను ఆగతమీశాలు, ఆగత పరివ్రుత్తాలు గూర్చి చదవాలి. దీనికి గాను ఆచార్య భద్రరాజు గారి తెలుగు భాషా చరిత్రలోని వి.స్వరిజ్యలక్ష్మి గారు రాసిన ‘తెలుగు అన్యదేశ్యలు’ వ్యాసం చదవాలి.

‘సాహిత్య విమర్శ’ అనే అధ్యాయం అభ్యర్ధులకు కఠినతరంగా అనిపిస్తుంది కాని ఎక్కువ సార్లు పునశ్చరణ చేస్తే ఇందులో పట్టు సాధించవచ్చు. ఇందులో భాగంగా నాయక నాయికా భేధాలు కావ్య నిర్వచనలు (భారతీయులు) కావ్య ప్రయోజనాలు, కావ్యాత్మ, కావ్య హేతువులు, వక్రక్తి భేధాలు రస ధ్వని సిద్ధాంతాలు ప్రవర్తకులు లేయలు, ప్రసిద్ధ విమర్శకులు, వీరి రచనలు, అలంకార శాస్రం, అలంకారికులు-వీరి కాలాలు ఆధునిక సాహిత్య విమర్శ ధోరణులు ప్రధానంగా నైతికో కళా రూప, సాంఘిక, మార్కిస్టు, మనోవైజ్ఞానిక, ఆర్కిటైపల్ శైలి శాస్ర్తాలను చదవాలి.

దీనికి గాను ఉపయుక్త గ్రంధాలు :

1 సాహిత్య సోపానాలు - ఆచార్య దివాకర్ణ వెంకటావధాని
2 సాహిత్య విమర్శ సిద్ధాంతం సూత్రాలు -ప్రొఫెసర్ వి.సిమ్మన్న

భాషా పరస్పర ప్రభావాలు, సంస్కృతి సమాజం అన్న అధ్యాయానికి సంబంధించి పైన పెర్కోన్న ఉపయుక్త గ్రంధాలు చదివితే సరిపోతుంది.

‘అనువాదం రీతులు- ఆవశ్యకత’ అను అధ్యాయాలు అనువాదం ముఖ్య లక్షణాలు, అనువాదం రకాలు, సమస్యలు, తెలుగు భాషా సంస్కృతం అనువాద ప్రాముఖ్యం, పరి భాఫా పదాల కల్పనలు ముఖ్యమైనవి. దీనికి గాను కాచమల్లు రామచంద్రా రెడ్డి గారి ‘అనువాద సమస్యలు’ అను గ్రంథం ఉపయుక్తమైనది.

ఇక కంటెంట్ ను చివరగా పఠనాగాహనం అధ్యాయాలు అపరిచిత పద్య, అపరిచిత గద్య భాగాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను అభ్యర్ధులు ఇచ్చిన వాటిని పలుమార్లు చదివి పఠనావగాహన చేసుకుంటే ప్రశ్నలకు త్వరగా మరియు సులభంగా సమాధానాలు గుర్తించగలరు.

తెలుగు భాషా భోధన పద్దతులు :-

డీఎస్సీ అభ్యర్ధులు విజయాన్ని ఈ విభాగామే నిర్ణయిస్తుందని చెప్పొచ్చు, అభ్యర్ధులు అత్యంత కష్టంగా భావించే విభాగం కూడా ఇదే మెథడాలజీలోని ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా కూడా ఉంటాయి. కారణం ఇందులో ప్రతి ప్రశ్నకు ఇచ్చే 4 ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి. దీనిలో అభ్యర్ధులు ఈ విభాగం చాలా తప్పులు చేస్తుంటారు. ఇందులో భాషా-వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు ప్రణాళికా రచన, భోధన పద్దతులు, భోధనోపకరణాలు, మూల్యాంకానం మొదలగునవి కీలకాంశాలుగా పెర్కోనవచ్చు. ముఖ్యవిషయం ఏమిటంటే మెథడాలజీలోను అంశాలను కంటెంట్ లోని పాఠ్యాంశాలకు అన్వయించుకోని (ఉదా. సాహిత్య ప్రక్రియలు-భోధన పద్దతులు) ప్రిపరేషన్ ను కొనసాగించాలి. మెథడాలజీ చదివేటప్పుడు అర్థమైనట్లే ఉంటుంది కాని ప్రశ్నలు సాధిస్తున్నాప్పుడే కష్టమవుతుంది. దీనిలోను నమునా ప్రశ్నలు సాధించడానికి కూడా ప్రత్యేకంగా సమయంను కేటాయించాలి. భావనలను తరగతి ఉపాధ్యాయుడు, విద్యార్థికి అను ప్రయుక్తం చేసుకోని అధ్యయనం చేయాలి. అవగాహన అనుపయుక్తం విశ్లేషన తార్కిక పద్దతికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చే సన్నద్ధమై ఉండటం అవసరం.

మెథడాలజీకి సంబంధించి ఎస్.జీ.టి అభ్యర్ధులు బీ.ఈడీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్ధులు తెలుగు అకాడమీకి చెందిన గ్రంధాలు రిఫరెన్సు పుస్తకాలుగా ఉపయోగపడతాయి. కావున వీటిని అభ్యర్ధులు అనేక సార్లు చదివితే మెథడాలజీలో పట్టు సాధించి గరిష్ట మార్కులు పొందవచ్చు.

విజేతలు కావాలంటే:-

1 తొలిసారిగా TSPSC నిర్వహిస్తున్న ప్రశ్నల స్థాయి మార్పులుండవచ్చు. కాబట్టి ఈసారి అభ్యర్థుల ప్రిపరేషన్ వ్యూహత్మకంగా ఉండాలి
2 కఠిన అంశాలు అయిన సాహిత్యవిమర్శ, వ్యాకరణ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
3 సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికను రుపొందిచుకోవాలి.
4 గత పరీక్ష పత్రాలను పరిశీలించి అంశాల వారీగా ప్రాధాన్యత గుర్తించి ఎక్కువ మార్కులు వస్తున్న చాప్టర్స్ కి అధిక సమయాన్ని కేటాయించాలి.
5 ప్రిపరేషన్ లో భాగంగా వివిధ అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యాంశాలు సొంతంగా నోట్సు రూపొందించుకోవాలి. దీని వల్ల రివిజన్ చాలా తేలికవుతుంది.
6 సాధ్యమైనన్నీ మాక్ టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఎక్కడ సమాధానాలను సరిగా గుర్తించలేక పోతున్నామో ఆ అంశాలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలి.
7 ఒత్తిడి అనుకోకుండా అనుక్షణం ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.

మాదిరి ప్రశ్నలు

1 ‘A Study of Telugu Temanticp’ అనే అశం పైన పరిశోధన చేసిన వారెవరు ?
జ) జి.ఎన్. రెడ్డి
2) ‘కప్పి ఉంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’ అని పేర్కొన్నవారెవరు ?
జ) ఆచార్య సి.నారాయణ రెడ్డి
3) ‘విగ్రహతంత్ర విమర్శనం గ్రంథకర్త ఎవరు ?
జ) కందుకూరి వీరేశ లింగం.
4) భాషాలోని ధ్వని మార్పులను మొట్ట మొదటి సారి వివరంగా తెల్పిన వారెవరు ?
జ) టాలేమి (ఇటలీ)
5) వ్యాకరణ బోధనలో ఉపయోగించే ఉత్తమ పద్ధతి ఏది ?
జ) అనుమానోపపత్తి పద్ధతి
6) పిల్లల్లో ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార మార్గాన్ని, లోక జ్ఞానాన్ని కల్గించేవి ఏమిటి ?
జ) పొడుపు కథలు
7) అప్యర్షక వాక్యంలో క్రీయధాతువుకు ఏ ప్రత్యయం చేరుతుంది ?
జ) ‘ఇనో’ అనే ప్రత్యయం
8 భారతదేశంలో మాండలికాలపై తొలి సారిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు ?
జ) జార్జ్ గ్రియర్ సన్
9 చిన్న పిల్లలు భాష నేర్చుకోవటం దేని వల్ల సాధ్యం అవుతుంది ?
జ) ఉత్పాదకతశక్తి

విలువైన ఈ ఆర్టికల్ అందించిన వారు :

చింతల రాకేశ్ భవానీ సార్
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా
సెల్: 9246607551
మెయిల్: rakeshbhavani125@gmail.com
Special Note:
మన https:www.tsexams.com వెబ్ సైట్ లో తెలుగు కంటెంట్ ను రాకేశ్ భవానీ సార్ అందిస్తారు. మాక్ టెస్టులు కూడా సార్ ప్రిపేర్ చేస్తున్నారు. కొందరు ఈ కంటెంట్ ను తమ పేర్లు పెట్టుకొని యూట్యూబ్ లు, వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. రాకేశ్ భవానీ సార్ ఎంతో రిక్వెస్ట్ చేసి... కంటెంట్ తెప్పించాం.

TRT mock testల షెడ్యూల్ వచ్చేవారంలో ప్రకటించబడతాయి.  ఫీజులు, టెస్టుల వివరాలను తెలియజేస్తాం.  కంటెంట్ రెడీ అవుతోంది.  ఫిబ్రవరిలో మీ ఎగ్జామ్ ముందు వరకూ మాక్ టెస్టులు కంటిన్యూ అవుతాయి.  ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది.  మెటీరియల్  Q&A రూపంలో ఇవ్వడంతో పాటు మాక్ టెస్టులను కూడా ప్రిపేర్ చేస్తున్నాం.  సిలబస్ వారీగా, పాఠాల వారీగా ముఖ్యమైన కంటెంట్ అంతా అందిస్తాం.